తిరుమలలో అరకు కాఫీ సందడి.. శ్రీవారి భక్తులకు గిరిజన ఉత్పత్తులు అందుబాటులోకి..

Jul 27, 2026 - 14:09
0 4
 తిరుమలలో అరకు కాఫీ సందడి.. శ్రీవారి భక్తులకు గిరిజన ఉత్పత్తులు అందుబాటులోకి..

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అరకు ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన జీఐ ట్యాగ్ అరకు కాఫీతో పాటు గిరిజనుల సహజ అటవీ ఉత్పత్తులు ఇకపై తిరుమలలోనే కొనుగోలు చేసే అవకాశం కలగనుంది. గిరిజనుల జీవనోపాధికి చేయూతనిస్తూ, భక్తులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

గిరిజన సహకార సంస్థ (GCC) ద్వారా అరకు ప్రాంతంలో తయారయ్యే ఉత్పత్తులను కొనుగోలు చేసి, తిరుమలలో ప్రత్యేక రిటైల్ ఔట్‌లెట్ ద్వారా విక్రయించేందుకు టీటీడీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం సుమారు రూ.12.97 కోట్ల విలువైన ఉత్పత్తులను ఏడాది పాటు నామినేషన్ విధానంలో కొనుగోలు చేయనుంది. ముందుగా సేకరించిన నమూనాలను టీటీడీ ప్రయోగశాలలో పరీక్షించి నాణ్యత నిర్ధారించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

తిరుమలలోని రెండో న్యూ సత్రం సమీపంలో ఉన్న షాపును జీసీసీ రిటైల్ ఔట్‌లెట్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ అరకు ఇన్‌స్టంట్ కాఫీ, లిక్విడ్ కాఫీతో పాటు గిరిజనులు తయారు చేసే తేనె, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు, ఇతర అటవీ ఉత్పత్తులు విక్రయించనున్నారు. కల్తీ లేని నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులో ఉండటంతో భక్తులు నేరుగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

ఈ షాపును మూడేళ్ల పాటు నామినేషన్ పద్ధతిలో నెలకు రూ.9,500 లైసెన్స్ ఫీజు (జీఎస్టీ అదనం) చెల్లించే విధంగా కేటాయించనున్నారు. అయితే ఈ ఔట్‌లెట్‌ను సబ్‌లీజ్ చేయరాదు, ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వకూడదు, గిరిజన ఉత్పత్తులనే విక్రయించాలనే నిబంధనలను టీటీడీ స్పష్టంగా పేర్కొంది.

అంతేకాదు, టీటీడీకి అవసరమైన కొన్ని ఉత్పత్తులను కూడా జీసీసీ నుంచే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందులో తేనె, కుంకుడుకాయల పొడి, ఎండుమిర్చి వంటి వస్తువులు ఉన్నాయి. ధరల విషయంలో ముందుగా తగ్గింపు కోరినా, ప్రభుత్వం ఆధ్వర్యంలోని సంస్థ కావడంతో అవసరమైతే జీసీసీ నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయవచ్చని టీటీడీ వెల్లడించింది. అయితే జీడిపప్పు కొనుగోలు మాత్రం టెండర్ ధరల ప్రకారమే జరుగుతుంది.

ఈ నిర్ణయంతో తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తులకు అసలైన అరకు కాఫీ రుచి మాత్రమే కాకుండా, గిరిజనుల చేతుల మీదుగా తయారైన సహజ ఉత్పత్తులు కూడా ఒకేచోట లభించనున్నాయి. ఇదే సమయంలో గిరిజనుల ఆదాయాన్ని పెంచే దిశగా కూడా ఈ చర్య కీలకంగా మారనుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User