“అఖిల్ కోసం తొలిసారి దేవుణ్ని ఒక కోరిక కోరుకున్నా”..భావోద్వేగానికి గురైన నాగార్జున
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం అఖిల్ కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్ర బృందం ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అక్కినేని నాగార్జున కొడుకు విజయం గురించి మాట్లాడుతూనే భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో తొలిసారి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఒక కోరిక కోరుకున్నానని వెల్లడించారు.
“అఖిల్‌కు హిట్ ఇవ్వమని స్వామిని వేడుకున్నా”
‘లెనిన్’సక్సెస్ మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ..“నా జీవితంలో నేను ఎప్పుడూ దేవుణ్ని ఏదీ అడగలేదు. ‘అన్నమయ్య’ సినిమా చేసినప్పుడు కూడా, ఎన్నిసార్లు తిరుమల వెళ్లినా కూడా నా కోసం ఎలాంటి కోరిక కోరుకోలేదు. భగవంతుడి దయతో నాకు జీవితంలో కావాల్సినవన్నీ లభించాయి. కానీ ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు మాత్రం మా అఖిల్‌కు ఒక మంచి బ్లాక్‌బస్టర్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. స్వామివారి ఆశీస్సులు, తెలుగు ప్రేక్షకుల ప్రేమతో ‘లెనిన్’ రూపంలో ఆ కోరిక నెరవేరింది” అని చెప్పారు.నాగార్జున ఈ వ్యాఖ్యలు అక్కినేని అభిమానులను భావోద్వేగానికి గురిచేశాయి.
భాగ్యశ్రీ కోరిక కూడా నెరవేరింది
సినిమా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గురించి కూడా నాగార్జున ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.తిరుమలలో భాగ్యశ్రీ కూడా తనకు ఒక మంచి హిట్ సినిమా రావాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రార్థించిందని, ‘లెనిన్’ విజయంతో ఆమె కోరిక కూడా నెరవేరిందని తెలిపారు.ఈ సినిమాలో ‘భారతి’పాత్రలో భాగ్యశ్రీ నటన ఎంతో ఆకట్టుకుందని ప్రశంసించారు.
‘అఖిల్ 2.0’ని చూస్తున్నారు
‘లెనిన్’ సినిమాలో అఖిల్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించాడని నాగార్జున అన్నారు. యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ సన్నివేశాల్లో అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకుందని పేర్కొన్నారు.థియేటర్లలో ప్రేక్షకులు ‘అఖిల్ 2.0’ను చూస్తున్నారని, ఈ సినిమా అతని కెరీర్‌కు బలమైన మలుపుగా నిలుస్తుందని అన్నారు.
ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు
‘లెనిన్’ చిత్రానికి ఇంతటి ఆదరణ చూపించిన తెలుగు ప్రేక్షకులకు నాగార్జున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అక్కినేని కుటుంబంపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, అభిమానమే తమకు మరింత బాధ్యతను పెంచుతుందని అన్నారు.
తొలి రోజు నుంచే భారీ వసూళ్లు సాధించిన ‘లెనిన్’ రాబోయే రోజుల్లో మరింత మంచి కలెక్షన్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)