హిందూ విద్యార్థికి కల్మా హోమ్‌వర్క్ ఇచ్చిన టీచర్, పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని సైదాబాద్‌లో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన వివాదాస్పదంగా మారింది. రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి ఇస్లామిక్ ప్రార్థనలైన కల్మా, సూరహ్ ఫాతిహా నేర్చుకుని రావాలని హోమ్‌వర్క్ ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్లో చదువుతున్న విద్యార్థి స్కూల్ డైరీలో క్లాస్ టీచర్ కల్మా, సూరహ్ ఫాతిహా చదవాలని రాసినట్లు గుర్తించారు. ఇంటికి వచ్చిన తర్వాత డైరీని పరిశీలించిన తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకుని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.మరుసటి రోజు విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. విద్యాసంస్థల్లో ఒక నిర్దిష్ట మతానికి చెందిన ప్రార్థనలను ఇతర మతాల విద్యార్థులకు హోమ్‌వర్క్‌గా ఇవ్వడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ఘటనతో పాఠశాల వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి, వాస్తవాలను నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, పలువురు సామాజిక సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)