బీహార్లో శ్రీవారి ఆలయం..15 ఎకరాల భూమి కేటాయింపు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహిమను దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలనే లక్ష్యంతో టీటీడీ మరో కీలక అడుగు వేసింది. ఉత్తర భారతదేశంలో శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక సేవలను మరింత చేరువ చేయడానికి పాట్నా సమీపంలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం బీహార్ ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది. పవిత్ర గంగా నది తీరానికి సమీపంలో, జాతీయ రహదారి పక్కన ఈ భూమిని కేటాయించడంతో ఉత్తర భారతదేశంలోని లక్షలాది మంది భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయం భవిష్యత్తులో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని భావిస్తున్నారు.ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ బి.ఆర్. నాయుడు బీహార్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిను కలిసి శాలువాతో సత్కరించి, శ్రీవారి దివ్య జ్ఞాపికను అందజేశారు. సమావేశంలో బీహార్ చీఫ్ సెక్రటరీ అమృత్ ప్రత్యయ్ కూడా పాల్గొన్నారు.

ప్రతిపాదిత ఆలయ ప్రాంగణంలో ప్రధాన శ్రీవారి ఆలయంతో పాటు కళ్యాణ మండపం, పవిత్ర పుష్కరిణి, యాత్రికుల విశ్రాంతి కేంద్రాలు, పార్కింగ్ సదుపాయాలు మరియు ఇతర ఆధునిక మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శన అనుభూతి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఈ ఆలయం కేవలం దేవాలయంగా మాత్రమే కాకుండా ఉత్తర భారతదేశంలో సనాతన ధర్మ ప్రచారానికి కేంద్ర బిందువుగా నిలిచేలా టిటిడి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయాలను నిర్మించాలనే సంకల్పంతో టిటిడి ముందుకు సాగుతోంది.
ఇప్పటికే గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించగా, ఇప్పుడు బీహార్లో కూడా ఆలయ నిర్మాణానికి భూమి లభించడం మరో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఉత్తర భారత భక్తులు తిరుమల చేరుకోలేని సందర్భాల్లో తమ ప్రాంతంలోనే శ్రీవారి దర్శనం పొందే అవకాశం కలగనుంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)