సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. ఏపీలో రాజకీయ దుమారం
కృష్ణలంక ప్రాంతానికి చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీస్ కస్టడీలోనే సాయికృష్ణ మాయమయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రత్యక్ష సాక్షి మహంకాళి చందు చేసిన వ్యాఖ్యలు కేసును మరింత సీరియస్‌గా మార్చాయి.
సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు మే 9న మార్కాపురం వద్ద అదుపులోకి తీసుకున్నారని, అప్పటి నుంచి అతని ఆచూకీ తెలియడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ కేసుపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలై, సాయికృష్ణను ఈ నెల 29న కోర్టు ముందు హాజరుపర్చాలని ఆదేశించినట్లు సమాచారం.
ప్రత్యక్ష సాక్షి మహంకాళి చందు మాట్లాడుతూ సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపించారు. లాకప్‌లో ఉన్నప్పుడే దాడి జరిగినట్లు తాను చూశానని, సాయిని కలిసేందుకు వచ్చిన వారిని పోలీసులు హడావుడిగా పంపించేశారని ఆయన తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఈ కేసు రాజకీయ దుమారానికి దారి తీసింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ విజయవాడ కృష్ణలంకలోని సాయికృష్ణ నివాసానికి వెళ్లారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని పరామర్శించి ఓదార్చారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని జగన్ డిమాండ్ చేశారు. . మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించగా, సంబంధిత సీఐని వీఆర్‌కు పంపించారు. హోం మంత్రి అనిత కూడా నిష్పక్షపాత విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.
మొత్తంగా ఈ కేసు పోలీస్ వ్యవస్థపై తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. హైకోర్టు విచారణ నేపథ్యంలో సాయికృష్ణ ఆచూకీపై స్పష్టత రావాల్సి ఉంది. నిజాలు వెలుగులోకి వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)