దమ్ముంటే రండి..జగన్ ఇంటి దగ్గర నుంచే లోకేష్ సవాల్

Jun 17, 2026 - 15:42
0 1
దమ్ముంటే రండి..జగన్ ఇంటి దగ్గర నుంచే లోకేష్ సవాల్

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై రాజకీయ వేడి కొనసాగుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సవాల్ విసిరారు.

“జగన్ ఇంటికి కేవలం 200 మీటర్ల దూరం నుంచే మాట్లాడుతున్నా.. దమ్ముంటే డీఎస్సీ అంశంపై చర్చకు రావాలి” అంటూ లోకేష్ సవాల్ చేశారు. వైసీపీ తరహాలో తాము ఆరోపణలు చేసి తప్పించుకునే వాళ్లం కాదని ఆయన స్పష్టం చేశారు.

డీఎస్సీ 2025 నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని లోకేష్ పేర్కొన్నారు. సబర్వాల్ జడ్జిమెంట్, వర్టికల్–హారిజాంటల్ రిజర్వేషన్ల వంటి సంక్లిష్ట అంశాలను ముందుగా అధ్యయనం చేసి, అన్ని నిబంధనలకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు.

ఇప్పటికే 16 వేల టీచర్ పోస్టులను 150 రోజుల్లో భర్తీ చేసినట్లు ఆయన వెల్లడించారు. అలాగే టెట్ పరీక్షలు మళ్లీ నిర్వహించనున్నామని, త్వరలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ద్వారా 10 వేల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ కాలేదని లోకేష్ విమర్శించారు. డీఎస్సీ నిర్వహణపై వైసీపీ నేతలే 240 కేసులు వేశారని , అందులో 43 కేసులు కోర్టు తిరస్కరించిందని ఆయన పేర్కొన్నారు.

రిజర్వేషన్ విధానాలపై అవగాహన లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని, గత ప్రభుత్వ తప్పిదాల వల్లే సమస్యలు వచ్చాయని లోకేష్ వ్యాఖ్యానించారు. చివరగా, డీఎస్సీపై ఏవైనా సందేహాలు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమని మరోసారి జగన్‌కు సవాల్ విసిరారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User