హైడ్రా చట్టానికి అతీతం కాదు.. ప్రైవేట్ భూమిలోకి ప్రవేశంపై హైకోర్టు సీరియస్
హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టానికి అతీతం ఏ సంస్థ కూడా కాదని స్పష్టం చేసిన కోర్టు, ప్రైవేట్ ఆస్తిలోకి ప్రవేశించిన ఘటనపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చర్యలను తప్పుబట్టింది.
రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట ప్రాంతంలోని సర్వే నంబర్ 1, 2 భూమికి సంబంధించి ఇప్పటికే ఆ భూమి యజమానుల స్వాధీన హక్కులను రక్షిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, హైడ్రా అధికారులు అక్కడికి వెళ్లడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఆ భూమి ప్రభుత్వానిదని నిరూపించడంలో అధికారులు విఫలమైన తర్వాత కూడా అక్కడికి వెళ్లడం ఎందుకని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే హైడ్రా పరిమితమని స్పష్టం చేసిన హైకోర్టు, చట్ట పరిధిని దాటి వ్యవహరించే అధికారం ఎవరికీ లేదని తేల్చి చెప్పింది.
విచారణ సందర్భంగా హైడ్రా తరపు న్యాయవాది, సొసైటీ ఫిర్యాదు ఆధారంగా స్థలాన్ని సందర్శించినట్లు కోర్టుకు తెలిపారు. అయితే ఇప్పటికీ ఆ భూమిపై ప్రభుత్వ హక్కులు నిరూపితమవలేదని కోర్టు గుర్తుచేసింది.
హైడ్రా ప్రత్యేక విభాగం కాదని, పరిపాలనా వ్యవస్థలో భాగమేనని పేర్కొన్న కోర్టు, ఇకపై ఆ భూమిలోకి ప్రవేశించబోమని ఇచ్చిన హామీని ఉల్లంఘించవద్దని స్పష్టం చేసింది. దీంతో సంబంధిత కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ముగించింది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)